Thursday, 28 June 2018

మే 2018 అవార్డ్స్

ఇండియన్ బ్యాంక్‌కు గోల్డెన్ పీకాక్ అవార్డు 
ఇండియన్ బ్యాంక్‌కు యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ అవార్డు-2018 లభించింది. ఏప్రిల్ 25న బిజినెస్ ఎక్స్‌లెన్స్ అండ్ ఇన్నోవేషన్ లీడర్‌షిప్‌పై దుబాయ్‌లో జరిగిన 28వ ప్రపంచ సదస్సు సందర్భంగా ఈ అవార్డులను ప్రదానం చేశారు.


యశశ్చంద్ర కు సరస్వతి సమ్మాన్ అవార్డు ప్రముఖ గుజరాతీ రచయిత సీతాన్షు యశశ్చంద్ర కు సరస్వతి సమ్మాన్ అవార్డు 2017 లభించింది. ‘వాఖర్’ అనే కవితా సంకలనాన్ని రచించినందుకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. కవి, నాటక రచయిత, అనువాదకుడు, విద్యావేత్త అయిన యశశ్చంద్ర 1941లో భుజ్‌లో జన్మించాడు. 2009 లో ప్రచురితమైన వాఖర్‌తో పాటు మరో రెండు కవితా సంకలనాలు, నాటకాలపై 10, విమర్శనాత్మక సాహిత్యంపై మూడు పుస్తకాలను వెలువరించారు. సరస్వతీ సమ్మాన్ అవార్డును కేకే బిర్లా ఫౌండేషన్ ప్రదానం చేస్తుంది.


సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు 
భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) అవార్డ్స్ కమిటీ ఏప్రిల్ 28న సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రకటించింది. పురుషుల విభాగంలో 2016-17 సంవత్సారానికి పంకజ్ రాయ్(మరణానంతరం), 2017-18 సంవత్సరానికి అన్షుమన్ గైక్వాడ్; మహిళల విభాగంలో 2016-17 సంవత్సరానికి డయానా ఎడుల్జీ, 2017-18 సంవత్సరానికి సుధా షా అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డు కింద రూ.25 లక్షల నగదు బహూకరిస్తారు.




ఏప్రిల్ 2018 అవార్డ్స్

యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ పురస్కారం 2018నిర్భంధంలో ఉన్న ఈజిప్టు ఫొటో జర్నలిస్టు మెహముద్ అబు జైద్ అలియాస్ షౌకన్ కు యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ పురస్కారం దక్కింది. 2013లో కై రో రక్షణ దళానికి, ఇస్లామిస్ట్ అధ్యక్షుడు మొహమ్మద్ మోర్సీ మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణలను కవర్ చేసినందుకుగాను షౌకన్‌ను అరెస్టు చేశారు. పత్రికా స్వేచ్ఛలో ప్రెస్ ఫ్రీడమ్ గ్రూప్ రిపోర్టర్స్ వితవుట్ బోర్డర్స్(ఆర్‌ఎస్‌ఎఫ్) మొత్తం 180 దేశాలకు ర్యాంకులు ప్రకటించగా, ఈజిప్టు 161వ స్థానంలో నిలిచింది.


అజహర్ మక్సూసీకి యుధ్‌వీర్ పురస్కారం
2018 సంవత్సరానికి ప్రతిష్టాత్మక యుధ్‌వీర్ ఫౌండేషన్ స్మారక పురస్కారం.. హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ ఉస్మాన్ అజహర్ మక్సూసీకి దక్కింది. ఉచితంగా అన్నదానం చేస్తూ పేదల ఆకలి తీరుస్తున్నందుకు ఆయనకు ఈ పురస్కారం లభించింది.

65వ జాతీయ చలన చిత్ర అవార్డులుజాతీయ స్థాయిలో సినిమా రంగానికిచ్చే ‘జాతీయ చలన చిత్ర అవార్డుల’ను ఏప్రిల్ 13న ప్రకటించారు. ఈ అవార్డుల్లో బాహుబలి-2, ఘాజీ చిత్రాలు టాప్ అవార్డులను దక్కించుకున్నాయి. ఇటీవల మరణించిన నటి శ్రీదేవికి ఉత్తమ నటి అవార్డు రాగా, అస్సామీ చిత్రం విలేజ్ రాక్‌స్టార్స్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ మేరకు న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవార్డుల జ్యూరీ కమిటీ అధ్యక్షుడు, బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్ 65వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించారు. 2017లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డులను ప్రకటించారు.

వరదరాజన్‌కు షోరెన్‌స్టెయిన్ అవార్డు 
ప్రతిష్టాత్మక ‘షొరెన్‌స్టెయిన్’ జర్నలిజం అవార్డు-2017ను న్యూస్ వెబ్‌సైట్ ‘ద వైర్’ వ్యవస్థాపక ఎడిటర్ సిద్దార్థ్ వరదరాజన్ అందుకోనున్నాడు. కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ఇచ్చే ఈ అవార్డును ఏప్రిల్ 16న రాజన్‌కి ప్రదానం చేస్తుంది. ఆసియా ప్రాంతంపై చేసిన రిపోర్టింగ్‌కు గాను వరదరాజన్‌కి ఈ పురస్కారం దక్కింది. ఢిల్లీకి చెందిన వరదరాజన్ గతంలో హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి జాతీయ పత్రికల్లో పనిచేశారు. 


కోహ్లీ, మిథాలీ కి విజ్డెన్’ పురస్కారం 
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, మహిళల సారథి మిథాలీ రాజ్ లు ప్రఖ్యాత క్రికెట్ మేగజైన్ ‘విజ్డెన్’ పురస్కారాలకు ఎంపికయ్యారు. దీంతో సెహ్వగ్ (2008, 2009) తర్వాత ‘విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్’ పురస్కారాన్ని వరుసగా రెండుసార్లు అందుకున్న భారత క్రికెటర్‌గా కోహ్లీ (2017, 2018) నిలిచాడు. మహిళల క్రికెట్‌లో అత్యధిక అర్ధ సెంచరీలు, పరుగులు చేసిన మిథాలీ ‘లీడింగ్ విమెన్ క్రికెటర్’గా నిలిచింది. అలాగే అఫ్గానిస్తాన్‌కి చెందిన రషీద్ ఖాన్ ‘ఫార్‌మోస్ట్ టి20 ప్లేయర్’ పురస్కారానికి ఎంపికయ్యాడు.


పులిట్జర్ బహుమతులు 2018
అమెరికాలో జర్నలిజం, సాహిత్యం, సంగీతంలో ఇచ్చే అత్యున్నత అవార్డులు పులిట్జర్ ప్రైజ్‌లను ఏప్రిల్ 17న ప్రకటించారు. ఈ అవార్డుల్లో జర్నలిజం విభాగంలో ది న్యూయార్క్ టైమ్స్, ది న్యూయార్కర్ పత్రికలు సంయుక్తంగా ఎంపికయ్యాయి. తమ కథనాల ద్వారా హాలీవుడ్‌లో జరుగుతున్న లైంగిక వేధింపుల ఉదంతాన్ని వెలుగులోకి తెచ్చినందుకు వీటికి ఈ పురస్కారం ప్రకటించినట్లు అవార్డుల కమిటీ పేర్కొంది.
సంగీత విభాగంలో 30 ఏళ్ల పాప్ గాయకుడు కెండ్రిక్ లామర్ రూపొందించిన ఆల్బమ్ ’డామ్న్’కు ఈ పురస్కారం దక్కింది. దీంతో పులిట్జర్ ప్రైజ్ పొందిన తొలి పాప్ గాయకుడిగా ఆయన రికార్డు సృష్టించారు.
సాహిత్యంలో అండ్రూ సీన్ గ్రీర్ రచించిన కాల్పనిక నవల ‘లెస్’కు పులిట్జర్‌ను సొంతం చేసుకున్నారు. లెటర్స్ అండ్ డ్రామా విభాగంలో కారోలిన్ ఫ్రేజర్ రాసిన ‘ఫైర్స్’అనే బయోగ్రఫీ, మార్టిన్ మజోక్ నాటకం ‘కాస్ట్ ఆఫ్ లివింగ్’ ఈ అవార్డుకు ఎంపికయ్యాయి.


ముగ్గురు భారతీయులకు ఐషో పురస్కారాలు
భారత్‌కు చెందిన ముగ్గురు ఆవిష్కర్తలు దావ్లే (థింకర్ బెల్ ల్యాబ్స్, బెంగళూరు), బాలాజీ తీగల(బ్రున్ హెల్త్, న్యూఢిల్లీ), వినాయక్ నందాలికే (యోస్త్రా ల్యాబ్స్, బెంగళూరు) అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్(ఏఎస్‌ఎంఈ) ఇన్నోవేషన్ షోకేస్ అవార్డులకు ఎంపికయ్యారు. ఆర్థిక, సాంకేతిక విభాగాల్లో నూతన ఆవిష్కరణలను ఆహ్వానిస్తూ ఏఎస్‌ఎంఈ 2018 సంవత్సరానికి ఈ పురస్కారాలను ప్రకటించింది.
దావ్లే ఆడియో టాక్టిల్ డివైజ్‌ను రూపొందించారు. దీనిపై రాసే బ్రెయిలీ లిపిని ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేసుకోవడంతో పాటు దీనిలో డిజిటల్ బ్రెయిలీ పలక, బ్రెయిలీ కీబోర్డు వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. బాలాజీ నవజాత శిశు మరణాల రేటు తగ్గించే లేబర్ డిటెక్షన్ టూల్‌ను రూపొందించగా, వినాయక్ ఫోర్టబుల్ మెడికల్ పరికరాన్ని తయారు చేశారు. ఇది మధుమేహ రోగులలో వచ్చే నరాల వ్యాధిని, దాని లక్షణాల ద్వారా ముందే పసిగడుతుంది.


దక్షిణ మధ్య రైల్వే జీఎంకు పురస్కారం 
ఉత్తమ పనితీరు కనబరిచినందుకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ బెస్ట్ ట్రాన్స్ఫార్మేషన్ ఇనీషియేటివ్ పురస్కారానికి ఎంపికయ్యారు. జోన్‌ను ఉత్తమంగా నిలిపేందుకు ఆయన చేసిన వినూత్న కార్యక్రమాలను, పనితీరును గుర్తించి రైల్వే మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 6న ఈ పురస్కారాన్ని ప్రకటించింది.


అనుష్క, రణ్‌వీర్‌లకు ఫాల్కే ఎక్స్‌లెన్స్ అవార్డు
బాలీవుడ్ నటి, నిర్మాత అనుష్కశర్మ, నటుడు రణ్‌వీర్ సింగ్ దాదా సాహెబ్ ఫాల్కే ఎక్స్‌లెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. మంచి కథలతో సినిమాల నిర్మాణానికి చొరవ చూపుతున్నందుకు గుర్తింపుగా అనుష్క, పద్మావతి చిత్రంలో అల్లావుద్దీన్ ఖిల్జీగా అద్భుత నటనను కనబర్చినందుకు రణ్‌వీర్ కు ఈ అవార్డు అందజేయాలని నిర్ణయించినట్లు దాదాసాహెబ్ ఫాల్కే ఫౌండేషన్ తెలిపింది. తన సోదరుడు కర్ణేశ్ శర్మతో కలిసి నిర్మాణ సంస్థను ప్రారంభించిన అనుష్క ‘ఎన్‌హెచ్ 10’ అనే చిత్రాన్ని నిర్మించింది. దీంతో 25 ఏళ్ల వయసులోనే యంగెస్ట్ ప్రొడ్యూసర్‌గా అనుష్క గుర్తింపు పొందింది.



మార్చి 2018 అవార్డ్స్

'వి ఆర్ సిక్స్' ప్రచారానికి పబ్లిక్ రిలేషన్ వీక్ అవార్డు అమెరికాలో మైనార్టీలుగా ఉన్న సిక్కుల్లో అవగాహన కల్పించడానికి నిర్వహించిన 'వి ఆర్ సిక్స్'(మేము సిక్కులం) ప్రచారానికి అమెరికా అత్యున్నత పురస్కారం దక్కింది. మైనార్టీ కమ్యూనిటీపై సిక్కులకు అవగాహన కల్పించేందుకు గత ఏడాది ఏప్రిల్‌లో నేషనల్ సిక్ క్యాంపెయిన్(ఎన్‌ఎస్‌సీ) అనే స్వచ్ఛంద సంస్థ ఈ ప్రచారాన్ని ప్రారంభించింది. మైనార్టీలపై అమెరికాలో జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ తమ వర్గానికి చెందినవారిని అప్రమత్తం చేయడమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ ప్రచారానికి దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన కనిపించింది. ఇందుకుగాను 2018 సంవత్సరానికి 'పీఆర్ వీక్' అనే పురస్కారం దక్కింది. 


కరణ్ థాపర్‌కు జీకే రెడ్డి పురస్కారం
పాత్రికేయరంగంలో ఎనలేని కృషిచేసిన ప్రముఖ జర్నలిస్టు, టీవీ వ్యాఖ్యాత కరణ్ థాపర్‌ను జీకే రెడ్డి స్మారక అవార్డు వరించింది. రాజ్యసభ సభ్యుడు, జీకే రెడ్డి స్మారక అవార్డు వ్యవస్థాపకుడు టి.సుబ్బరామిరెడ్డి, టీఎస్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో అవార్డు ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ చేతుల మీదుగా థాపర్ ఈ అవార్డును అందుకున్నారు. సుబ్బరామిరెడ్డి, అవార్డు కమిటీ చైర్మన్, మాజీ కేంద్రమంత్రి కరణ్ సింగ్, మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అవార్డుతోపాటు ప్రశంసా పత్రం, రూ.5లక్షల నగదు అందజేశారు.

కామన్వెల్త్ యూత్ అవార్డుల్లో ఇద్దరు భారతీయులకు చోటు 
'కామన్వెల్త్ యూత్ అవార్డు'ల జాబితాలో ఇద్దరు భారతీయులకు చోటు దక్కింది. మొత్తం 53 దేశాల నుంచి ఎంపిక చేసిన తుది 20 మందిలో భారత్‌కు చెందిన మృణాళిని దయాళ్, యోగేశ్ కుమార్ పేర్లు ఉన్నాయి. 'హెల్త్ ఓవర్ స్టిగ్మా' పేరుతో మృణాళిని చేస్తున్న ప్రచారానికిగాను ఆమెను ఎంపిక చేయగా.. 'ఈవెన్ కార్గో' స్వచ్ఛంద సంస్థ ద్వారా అందిస్తున్న సేవలకుగాను యోగేశ్ కుమార్‌ను ఎంపిక చేసినట్లు కామన్వెల్త్ యూత్ ప్రోగ్రామ్ ప్రకటించింది.
లైంగిక ఆరోగ్యం పట్ల మహిళల్లో అవగాహన కల్పించేందుకు మృణాళిని కృషి చేస్తున్నారు. కొరియర్ రంగంలో తొలిసారిగా మహిళలకు అవకాశం కల్పించి, లింగ సమానత్వం కోసం యోగేశ్ కుమార్ పాటు పడుతున్నాడు. 15 నుంచి 29 సంవత్సరాల వయసు వారినే ఎంపిక చేసే ఈ అవార్డు కోసం.. యువతరంపై ప్రభావం చూపే కార్యక్రమాలను చేపట్టే వారికే తొలి ప్రాధాన్యం ఇస్తారు.


రిలయన్స్ కు ‘డ్రైవర్స్ ఫర్ చేంజ్’ పురస్కారం ప్రతిష్టాత్మక ఫైనాన్షియల్ టైమ్స్ ఆర్సెలర్ మిట్టల్ బోల్డ్‌నెస్ ఇన్ బిజినెస్ అవార్డ్స్ కార్యక్రమంలో ’మార్పు చోదకులు’ పురస్కారాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అందుకున్నారు. హైడ్రోకార్బన్‌‌స అన్వేషణ, ఉత్పత్తి.. పెట్రోలియం రిఫైనింగ్..మార్కెటింగ్, పెట్రోకెమికల్స్, రిటైల్, 4జీ డిజిటల్ సర్వీసుల విభాగంలో అత్యుత్తమ పనితీరునకు గాను రిలయన్‌‌స ఇండస్ట్రీస్‌కి ఈ పురస్కారం దక్కింది. 


హెచ్.జే.భాభా స్మారక అవార్డు అందుకున్న డా.జైన్
డీఆర్‌డీఓ శాస్త్రవేత్త డాక్టర్ ప్రకాశ్ చంద్ జైన్ మార్చి 16న ప్రతిష్టాత్మక హోమీ జహంగీర్ భాభా స్మారక అవార్డు అందుకున్నారు. ఇంఫాల్‌లో జరిగిన 105వ భారత సైన్స్ కాంగ్రెస్‌లో కేంద్ర మంత్రి హర్షవర్థన్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. హైదరాబాలోని డీఆర్‌డీవోలో పనిచేస్తున్న డా.జైన్ ఎయిరోస్పేస్ ఇంజనీరింగ్‌లో విశేష కృషి చేశారు. దానికి గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు.

కలెక్టర్ యోగితా రాణాకు అవార్డు 
‘బేటీ బచావో.. బేటీ పడావో’లో హైదరాబాద్ నగరం అద్భుత ప్రగతి సాధించినందుకు గాను ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా అవార్డు అందుకున్నారు. మార్చి 8న రాజస్తాన్‌లోని జుంజునులో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలో యోగితా రాణాకు మోదీ అవార్డును బహూకరించారు. ‘బేటీ బచావో-బేటీ పడావో’లో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో బాలికా సంరక్షణ, బాలికా విద్యకు విశేష కృషికి గాను ఈ మేరకు ఆమెను సత్కరించారు. ఈ పథకం అమలులో హైదరాబాద్ జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. బాలికల నిష్పత్తి పురోభివృద్ధికి యోగితా రాణా ప్రత్యేక చొరవను ప్రధాని ప్రశంసించారు. ఈ పథకం ప్రారంభం అయిన తరువాత మహా నగరంలో ప్రతి వెయి్య మంది బాలురకు బాలికల నిష్పత్తి శాతం 914 నుంచి 968కు పెరిగింది. లింగ నిర్ధారణ కట్టడి, బాలికల పట్ల చిన్నచూపు, సెక్స్ డిటర్మినేషన్ టెస్ట్‌లు, ఒక మగపిల్లాడు పుడితే రెండో బిడ్డకి నో చెప్పే పద్ధతి లాంటి కార్యక్రమాలతో నగరంలో బాలికల శాతం పెరిగింది. 


జయమ్మకు నారీ శక్తి పురస్కారం ప్రదానం
నారీ శక్తి పురస్కారాన్ని 2017 సంవత్సరానికి గానూ తెలంగాణ నుంచి జయమ్మ అందుకున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సమాజంలోని అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మహిళలను గుర్తించి కేంద్రం నారీ శక్తి పురస్కారాలను ప్రదానం చేస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్‌ఐవీ నియంత్రణకు, సెక్స్ వర్కర్ల కుటుంబాల పరిరక్షణకు చేస్తున్న ఉద్యమాలకు గుర్తింపుగా తెలగాణకు చెందిన జయమ్మను నారీ శక్తి పురస్కారానికి కేంద్రం ఎంపిక చేసింది. మార్చి 8న ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకున్నారు.


క్లిక్స్‌కు యునెస్కో అవార్డు 
దేశంలో నాలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న కనెక్టెడ్ లెర్నింగ్ ఇనీషియేటివ్ ప్రోగ్రామ్(క్లిక్స్)కి యునెస్కో అవార్డు లభించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగపరచుకుంటూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు తెలంగాణ, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాలు చేస్తున్న కృషికి యునెస్కో ఈ అవార్డు అందించింది. ప్రపంచ వ్యాప్తంగా 143 ప్రాజెక్టుల్లో మన క్లిక్స్‌తో పాటు మొరాకోకు చెందిన జెనీ ప్రాజెక్టులు ఈ అవార్డులను పొందాయి. క్లిక్స్ ద్వారా మన రాష్ట్రంలో 12 జిల్లాల్లో 10,080 మంది విద్యార్థులకు, 1589 టీచర్లకు శిక్షణ అందించారు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ (టిస్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్లిక్స్‌ను మరిన్ని పాఠశాలల్లో నిర్వహించాలని నిర్ణయించారు. 

బాలకృష్ణ దోశీకి ప్రిట్జ్‌కర్ ప్రైజ్
‘ఆర్కిటెక్చర్ నోబెల్’గా పిలిచే ప్రిట్జ్‌కర్ ప్రైజ్.. భారత్‌కు చెందిన బాలకృష్ణ దోశీకి దక్కింది. న్యూయార్క్‌లో మార్చి7న ఆయన ఎంపికను ప్రకటించారు. తక్కువ వ్యయంతో ఇళ్ల నిర్మాణానికి దోశీ ఆధ్యుడు.

90వ ఆస్కార్ అవార్డులు ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజిలెస్‌లో అట్టహాసంగా జరిగింది. మార్చి 5న డాల్బీ థియేటర్ వేదికగా జరిగిన 90వ అకాడమీ అవార్డుల పండుగలో ‘ది షేప్ ఆఫ్ వాటర్’ చిత్రం ఏకంగా నాలుగు విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. ‘డన్‌కర్క్’ చిత్రం మూడు విభాగాల్లో అవార్డులను గెల్చుకొని రెండోస్థానంలో నిలిచింది. ఈ కార్యక్రమానికి అమెరికన్ టెలివిజన్ హోస్ట్ జిమ్మీ కిమ్మెల్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 
అవార్డు విజేతలు 
ఉత్తమ చిత్రం
: ది షేప్ ఆఫ్ వాటర్

ఉత్తమ డెరైక్టర్
: గెలెర్మో డెల్‌టొరో (ది షేప్ ఆఫ్ వాటర్)

ఉత్తమ నటి
: ఫ్రాన్సెన్స్ మెక్‌డోర్మండ్ (త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి)

ఉత్తమ నటుడు
: గ్యారీ ఓల్డ్‌మేన్ (డార్కెస్ట్ అవర్) 

ఉత్తమ సహాయ నటి
: ఎలిసన్ జేలీ (ఐ, టోన్యా)

ఉత్తమ సహాయ నటుడు
: సామ్ రాక్‌వెల్ (తీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి)

ఉత్తమ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్)
: జోర్డాన్ పీలే (గెట్ ఔట్)

ఉత్తమ స్క్రీన్‌ప్లే (అడాప్టెడ్)
: జేమ్స్ ఐవరీ (కాల్ మీ బై యువర్ నేమ్)

ఉత్తమ సినిమాటోగ్రఫీ
: రోజర్ డీకిన్స్ (బ్లేడ్ రన్నర్ 2049)

ఉత్తమ ఒరిజినల్ స్కోర్
: అలెగ్జాండర్ డిప్లా (ది షేప్ ఆఫ్ వాటర్)

ఉత్తమ ఒరిజినల్ సాంగ్
: క్రిస్టిన్ ఆండర్సన్ లోపెజ్, రాబర్ట్ లోపెజ్
( సాంగ్ : రిమెంబర్ మి సినిమా : కోకో)


ఉత్తమ యానిమేటెడ్ ఫిల్మ్(ఫీచర్)
: కోకో


ఉత్తమ యానిమేటెడ్ ఫిల్మ్ (షార్ట్)
: డియర్ బాస్కెట్ బాల్

ఉత్తమ లైవ్ యాక్షన్ (షార్ట్)
: ది సెలైంట్ చైల్డ్

ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్ (ఫీచర్)
: ఇకారస్


ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్ (షార్ట్)
: హెవెన్ ఈజ్ ఎ ట్రాఫిక్ జామ్ ఆన్ ద 405


ఉత్తమ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్
: ఎ ఫెంటాస్టిక్ వుమన్ (చిలీయన్ సినిమా)

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్
: పాల్ డీ ఆస్టర్‌బెల్లీ, జెఫ్రీ ఎ మాల్విన్, షేన్ వియ (ది షేప్ ఆఫ్ వాటర్)

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్
: జాన్ నెల్సన్, గెర్ద్ నెఫ్‌జర్, పాల్ లాంబర్ట్, రిచర్డ్ ఆర్ హూవర్ (బ్లేడ్ రన్నర్ 2049)

ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్
: లీ స్మిత్ (డంకర్క్)

ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్
: కజుహిరొ సుజి, డేవిడ్ మాలినోవ్‌స్కీ, లూసీ సిబ్బిక్ (డార్కెస్ట్ అవర్)

ఉత్తమ కాస్టూమ్ డిజైన్
: మార్క్ బ్రిడ్జెస్ (ఫాంటమ్ థ్రెడ్)

ఉత్తమ సౌండ్ ఎడిటింగ్
: రిచర్డ్ కింగ్, అలెక్స్ గిబ్సన్ (డంకర్క్)

ఉత్తమ సౌండ్ మిక్సింగ్
: మార్క్ వెంగర్టిన్, గ్రెగ్ ల్యాండెకర్, గ్యారీ ఎ రిజొ (డంకర్క్)

ఉమా సుధీర్ కు చమేలీ దేవి అవార్డు 
2017 సంవత్సరానికి ప్రతిష్టాత్మక చమేలీ దేవి అవార్డు ఎన్డీటీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఉమా సుధీర్‌కు లభించింది. రాజకీయాలు, పిల్లలు, మహిళలు, మానవ హక్కులు, వ్యవసాయం, గ్రామీణ సమస్యలు, మైనారిటీల సమస్యలు తదితరాలపై ఆమె విసృ్తతంగా వెలువరించిన కథనాలకు ఈ గుర్తింపు లభించింది. ఉమా సుధీర్ విశ్లేషణాత్మక కథనాలు క్షేత్రస్థాయిలో వాస్తవాలపై అవగాహన కలిగించేందుకు దోహదపడ్డాయని అవార్డు అందించే మీడియా ఫౌండేషన్ పేర్కొంది.

ఫిబ్రవరి 2018 అవార్డ్స్

నరిశెట్టి రాజుకు ఎన్‌ఆర్ చందూర్’ అవార్డు 
అంతర్జాతీయ స్థాయి మీడియా సంస్థల్లో ఉన్నతస్థాయిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న తెలుగుతేజం, ప్రముఖ జర్నలిస్టు, అమెరికాకు చెందిన గిజ్‌మోడో మీడియా గ్రూప్ సీఈవో నరిశెట్టి రాజు 2018 సంవత్సరానికి గాను ఎన్‌ఆర్ చందూర్ జగతి పురస్కారాన్ని అందుకున్నారు. ఫిబ్రవరి 21న ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో జరిగిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడి చేతుల మీదుగా నరిశెట్టి రాజు పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ జర్నలిస్టు ఎన్‌ఆర్ చందూర్ జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు, అమరజీవి శ్రీపొట్టిశ్రీరాములు స్మారక సమితి ఏటా ఉత్తమ జర్నలిస్టులకు పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. 
తెనాలి పాత తాలూకాలోని చేబ్రోలుకు చెందిన నరిశెట్టి రాజు జర్నలిజంలో చేరిన కొత్తలో తెలుగు, ఆంగ్ల పత్రికల్లో పని చేశారు. అనంతరం అమెరికాలోని డేటన్ డైలీ న్యూస్, వాల్ స్ట్రీట్ జర్నల్, వాషింగ్టన్ పోస్ట్‌ల్లో రిపోర్టర్ స్థాయి నుంచి మేనేజింగ్ ఎడిటర్ స్థాయికి ఎదిగారు. 


శ్రమ్’ పురస్కారాల ప్రదానం 
దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో నైపుణ్యంతో, నిజాయితీగా పనిచేసే సిబ్బందికి, కార్మిక అభివృద్ధికోసం పనిచేసిన 338 మందిని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ ‘ప్రధాన మంత్రి శ్రమ్’పురస్కారాలతో సత్కరించింది. ఏటా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకటించే ఈ అవార్డులను గత ఆరేళ్లకుగానూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ఫిబ్రవరి 26న ఢిల్లీలో ప్రదానం చేశారు. హైదరాబాద్‌లోని బ్రహ్మాస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన కె.రామ్‌ప్రసాద్, హైదరాబాద్ బీహెచ్‌ఈఎల్‌కు చెందిన సి.కుమార్, జి.గోవర్దన్‌రెడ్డి, వెంకటేశ్వరరావు, రాజేందర్ ప్రసాద్ పురస్కారాలు దక్కించుకున్నారు.

యశ్ చోప్రా అవార్డు అందుకున్న ఆశా భోంస్లే 
లెజండరీ సింగర్ ఆశా భోంస్లేకు ప్రతిష్టాత్మక యశ్ చోప్రా మెమోరియల్ అవార్డును టి.సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ ఫిబ్రవరి 16న ముంబైలో ప్రదానం చేసింది. ఏడు దశాబ్దాల సుదీర్ఘ సంగీత ప్రస్థానంలో ఆశా భోంస్లే 20 భాషల్లో దాదాపుగా 11వేల పాటలు పాడి ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ఆమెకు యశ్ చోప్రా అవార్డు ప్రదానం చేయడం ఆనందంగా ఉందన్నారు టీయస్సార్. ఈ కార్యక్రమంలో టి. సుబ్బరామిరెడ్డి, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, నటి జయప్రద, బాలీవుడ్ నటి రేఖ పాల్గొన్నారు.
2012లో చనిపోయిన యశ్ చోప్రా జ్ఙాపకార్థం టి. సుబ్బరామిరెడ్డి, అను రంజన్, శశి రంజన్‌లు నెలకొల్పిన ఈ అవార్డును ఇదివరకు లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్, రేఖ, షారుక్ ఖాన్ అందుకున్నారు. ఈ అవార్డుతో పాటు 10 లక్షల నగదు కూడా అందజేస్తారు.


ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులకు ఎస్’ పురస్కారం 
వినూత్న ఆవిష్కరణల్లో ముందుండే ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులు అరుదైన అవార్డును సొంతం చేసుకున్నారు. తమ ప్రతిభాపాటవాలతో ప్రతిష్టాత్మకంగా భావించే యంగ్ ఇంజినీర్స్ అండ్ సైంటిస్ట్స్(వైఈఎస్) అవార్డును కైవసం చేసుకున్నారు. ఏటా హోండా మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ పురస్కారాన్ని విద్యాసంవత్సరంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఇస్తుంటారు. ప్రస్తుతం 2017-18 సంవత్సరానికి గాను పియూష్ నందా, బిందు సాంచెట్టి, అయాన్ మజుందార్‌లు ఈ అవార్డును గెలుచుకున్నారు. వీరంతా తమతమ కోర్సులలో అత్యంత ప్రతిభ చూపిన విద్యార్థులే. హోండా సంస్థ అధికారులు మాట్లాడుతూ.. ఎస్ అవార్డు సొంతం చేసుకున్న ఈ ముగ్గురు విద్యార్థులకు 3వేల డాలర్ల ప్రైజ్‌మనీ అందిస్తామని ప్రకటించారు. దీనితోపాటు జపాన్‌లోని రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో క్రెడిట్ గ్రాంటింగ్ ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని కల్పిస్తామని వెల్లడించారు. 


ప్రొఫెసర్ జగదీశ్‌కు నాయుడమ్మ అవార్డు నెల్లూరులోని నాయుడమ్మ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆల్టర్నేటివ్‌‌స సంస్థ ఏటా అందించే ప్రతిష్టాత్మక నాయుడమ్మ అవార్డును ఈ ఏడాది ఆస్ట్రేలియాకు చెందిన ప్రొ.డాక్టర్ చెన్నుపాటి జగదీశ్‌కు అందచేస్తున్నట్లు ఆ సంస్థ డెరైక్టర్ ఎ.జగదీశ్ ఫిబ్రవరి 7న తెలిపారు. ఆస్ట్రేలియా నేషనల్ వర్సిటీలో జగదీశ్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఢిల్లీ వర్సిటీ నుంచి డాక్టరేట్‌ను పొందారు. ఆయన సెమీ కండక్టర్ ఆఫ్టో ఎలక్ట్రానిక్స్, నానో టెక్నాలజీలో విశేష కృషి చేశారు. పలు అంశాలపై ఆయన రాసిన 870కుపైగా పరిశోధనాపత్రాలు ప్రచురిత మయ్యాయి. అమెరికాలో 5 పేటెంట్లతో పాటు 11 పుస్తకాలు ప్రచురించారు. గతంలో ఈ అవార్డును కె.కస్తూరి రంగన్, నందన్ నీలేకని తదితర ప్రముఖులు అందుకున్నారు.


నౌహెరాకు పవర్ ఫుల్ ఉమెన్ అచీవర్ అవార్డు 
నెక్స్‌బ్రాండ్ తాజాగా ‘పవర్‌ఫుల్ ఉమెన్ అచీవర్’ అవార్డును ప్రకటించింది. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో హీరా గ్రూప్ వ్యవస్థాపకురాలు, సీఈవో షేక్ నౌహెరా ఈ అవార్డును అందుకున్నారు. ఆమె 19 ఏళ్ల వయసులో విద్యా రంగంలో కెరీర్‌ను ప్రారంభించారు. తర్వాత మల్టీ డైవర్సిఫైడ్ కంపెనీ ‘హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్’ను స్థాపించారు. ఇది జువెలరీ, టెక్స్‌టైల్, ఎడ్యుకేషన్, మినరల్ వాటర్, గ్రానైట్, గోల్డ్, టూర్స్ అండ్ ట్రావెల్స్, రియల్ ఎస్టేట్, ఎలక్ట్రానిక్స్ వంటి వివిధ రకాల వ్యాపారాలను నిర్వహిస్తోంది. నౌహెరా ఇటీవల ‘ఆల్ ఇండియా మహిళా సాధికారత పార్టీ’ని స్థాపించడం ద్వారా రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. 


ప్రముఖ వైద్యుడు జీఆర్ రెడ్డికి అంతర్జాతీయ అవార్డు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ జీఆర్ రెడ్డికి ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆప్తమాలజీ అవార్డు లభించింది. అంధత్వ నివారణకు కృషి చేస్తున్న వైద్యులకు ఈ అవార్డు ప్రదానం చేస్తారు. భారతదేశం నుంచి జీఆర్‌రెడ్డికి మాత్రమే ఈ పురస్కారం దక్కింది. జీఆర్ రెడ్డి గ్రామీణ ప్రాంతంలో గ్లకోమా (నీటి కాసులు)పై అవగాహన కల్పించడంతోపాటు 30 ఏళ్లుగా డయాబెటిక్ రెటినోపతిని ప్రజలకు చేరువ చేశారు. భారత్‌లో అత్యధికంగా రెటీనా శస్త్రచికిత్సలు చేసిన డాక్టర్‌గా కూడా ఆయనకు గుర్తింపు ఉంది.


శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు గోల్డెన్ పీకాక్ అవార్డు 
కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) విభాగంలో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం గోల్డెన్ పీకాక్ అవార్డును చేజిక్కించుకుంది. బెంగళూరులో ఫిబ్రవరి 12న జరిగిన అంతర్జాతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెరైక్టర్స్ సదస్సులో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వెంకటాచలయ్య ఎయిర్‌పోర్టు నిర్వాహకులైన జీఎంఆర్ సంస్థ ప్రతినిధులకు ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు సీఈఓ ఎస్‌జీకే కిశోర్ మాట్లాడుతూ..పన్నెండేళ్లుగా జీఎంఆర్ సంస్థ వరలక్ష్మీ ఫౌండేషన్ ద్వారా విమానాశ్రయ పరిసర గ్రామాల్లో యువతకు ఉపాధి అవకాశాలు, వైద్య, విద్య, మహిళా సాధికారతపై అనేక కార్యక్రమాలను చేపడుతోందన్నారు.


నరిశెట్టికి ఎన్‌ఆర్ చందూర్-జగతి అవార్డు ప్రముఖ సాహితీవేత్త ఎన్‌ఆర్ చందూర్-జగతి అవార్డు 2018ని గిజ్‌మోడో మీడియా గ్రూప్ సీఈవో రాజు నరిశెట్టి (అమెరికా)కి ప్రకటించారు. ఈ మేరకు మాజీ ఎంపీ, కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఫిబ్రవరి 21న న్యూఢీల్లీలోని ఉపరాష్ట్రపతి కార్యాలయ సమావేశ మందిరంలో జరిగే ఈ కార్యక్రమంలో అవార్డుని ప్రదానం చేస్తామని తెలిపారు.